May 3, 2020

Appu Chesi Pappu Koodu (1959): L V Prasad’s Cult Film #TeluguCinemaHistory

Appu Chesi Pappu Koodu (1959): L V Prasad’s Cult Film #TeluguCinemaHistory

‘అప్పుచేసి పప్పుకూడు’ తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యమిదే కనరా పామరుడా అనే సమకాలీన సామాజిక న్యాయసూత్రం చుట్టూ అల్లబడిన కథ విజయవారి ‘ఆప్పుచేసి అప్పుకూడు’ చిత్రానికి ఆలంబన, ‘ఆఫ్ కోర్స్ నీకు హోటల్లో అప్పు పుట్టడంలేదు కానీ టిఫిన్ కావాలి. ఆ పక్కనే వున్న కిళ్ళీకొట్టులో అప్పుపుడుతుంది. కాబట్టి రెండు సిగరెట్ పెట్టెలు కిళ్ళీ షాపులో అప్పు పద్దతిలో తీసుకుని, వాటిని మరో షాపులో పావలా తక్కువకు అమ్మి ఆ డబ్బుతో టిఫిన్ కొని తినవచ్చు’ ఇది అప్పుచేయడం అనే ఆర్జు.. అనగా కళలో ఆరితేరిన ఘనాపాఠి భజగోవిందం ఇచ్చేసూచన. ఒకవేళ అప్పు తీర్చలేకపోతే ఎలాగూ ఐ.పి. బాంబు వుండనేవుంది. ఈ థియరీ మీద రసవత్తరంగా హాస్యపరంగా ఈ చిత్రకథాకథనాన్ని రూపొందించారు నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి, రచయిత సదాశివబ్రహ్మం, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్.

Click Here to go to Appu Chesi Pappu Koodu (1959) Movie Page.

ఈ చిత్రకథలో రామదాసు (సి.యస్.ఆర్) చిత్రవిచిత్రంగా అప్పులు చేయడంలో దిట్ట. అవి ఎవరెస్టు శిఖరంగా పెరిగిపోతాయి. ఈయనకు ఓ కుమారుడు రఘు (జగ్గయ్య). అతనికి ఎప్పుడో లీల (జమున) అనే అమ్మాయితో పెళ్ళవుతుంది. అమె అన్న రాజా (యన్.టి.ఆర్) రాజకీయాలలో వుండి జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. రామదాసు ఏ విధంగానైనా లీలను తప్పించి తన కొడుక్కి మంజరి అనే అమ్మాయితో పెళ్ళి జరిపించాలని తాపత్రయపడతాడు. ఆ మoజరి (సావిత్రి) బాగా ఆస్తిపరుడైన ముకుందరావు (యస్.వి.రంగారావు)కు మనువరాలు. ఆ ముకుందరావు తన మనువరాల్ని ఎప్పటికైనా ఓ చిన్న సైజు జమీందారు లాంటి రాజాకిచ్చి పెళ్ళి చేయాలని ఆశ. ఆ మేరకు జైలునుంచి విడుదలైన రాజా, బొంకులమర్రి రాజాగా రంగప్రవేశంచేసి ముకుందరావుని ఆకర్షిస్తాడు. అంతకుముందే అతను మంజరిని ప్రేమిస్తాడు.

రాజా హెచ్చరికకు భయపడ్డ రామదాసు తన కోడలు లీలను ఇంట్లో పనిమనిసిగా వుంచుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే ఆమె మూగమనిషిగా నటించాలని షరతు. ఈ పాత్రలమధ్య జరిగే అన్ని సన్నివేశాలకి నాటకీయంగా రూపకల్పన చేస్తాడు భజగోవిందం (రేలంగి). ఈ భజగోవిందం నాటకం వేషాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూంటుంది అతని ప్రియురాలు గిరిజ చివరకు అప్పులు చెయ్యడంలోగల చిక్కులు తెలుసుకుంటాడు రామదాసు. మూడుజంటలు మంజరి-రాజా, రఘు-లీల, భజగోవిందం-గిరిజ ఏకం కావడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో కథకంటే కథనానికి ప్రాధాన్యం ఎక్కువ. అసలు అప్పుచేసి బతకడం అనే కొత్త పాయింట్తో కథ నడపడం సాహసమే. అయితే హాస్యాన్ని పండించడంలో దిట్ట అయిన ప్రసాద్, చక్రపాణిల కలయికలో సన్నివేశాలన్నీ మేలికరం హాస్యరసాన్ని పండించాయి.

కీలకపాత్రల్లో సి.యస్.ఆర్., యస్.వి.రంగారావు, యన్.టి.ఆర్., సావిత్రి, జగ్గయ్య, జమున, రేలంగి, గిరిజ హాస్యరసాన్ని అద్భుతంగా ఆవిష్కరించగా, సహాయపాత్రల్లో రమణారెడ్డి, శివరావు, ముక్కాముల, ఆర్.నాగేశ్వరరావు, సూర్యకాంతం నటించారు.

ఇ.వి.సరోజ, మిక్కిలినేని అంతర్నాటక దృశ్యాలలో పాల్గొన్నారు. మార్కస్ బార్ట్లే చాయాగ్రహణం కనువిందు చేస్తుంది. పింగళి నాగేంద్రరావు రాయగా యస్.రాజేశ్వరరావు స్వరపరిచిన గీతాలన్నీ హాయిగా వీనులవిందుగా వుంటాయి.

సావిత్రిపై చిత్రీకరించిన ‘ఎచటినుంచి వీచెనో ఈ చల్లనిగాలి’, సావిత్రి యన్.టి.ఆర్., జగ్గయ్యలపై చిత్రీకరించిన ‘సుందరాంగులను చూచినవేళ కొందరు ముచ్చట పడనేల’, జమున, జగ్గయ్యలపై చిత్రీకరించిన ‘మూగవై ఏమిలే’ అన్న పాటలన్నీ రసరమ్యంగా వుంటాయి. ఇక హాస్యజంట రేలంగి-గిరిజపై చిత్రీకరించిన యుగళగీతాలు ఓ పంచెవన్నెల చిలకా నీకెందుకింత అలుక’, ‘కాశీకి పోయాను రామాహరి గంగతీర్ధమ్ము తెచ్చాను రామాహరి’ అన్న గీతాలు గిలిగింతలు పెడతాయి.

సినిమా అంటే ఏడుపులు, పెడబొబ్బలేకాదు, మూడుగంటలు హాయిగా నవ్వుకుంటూ ఆనందించదగ్గదనీ, దానికి సుమధుర సంగీతం తోడయితే ఆ ఆనందానికి అవధులు వుండవనీ నిరూపించిన విజయవారి చిత్రం ‘అప్పుచేసి పప్పుకూడు’.

Akkineni Nageswara Rao was first approached for the role of Dr. Raghu. ANR excused himself citing date problems and Jaggaiah stepped in.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments