అరేబియన్ ప్రేమకథ ‘లైలా మజ్ను’, మొఘల్ సామ్రాజ్య ప్రేమకథ ‘అనార్కలి’, బెంగాలీ ప్రేమ కథ ‘దేవదాసు’ ఈ మూడు విషాదాంతాలే. కొన్ని వందల ప్రేమకథలకు ఇవే ప్రేరణ,ఆధారం. తెలుగులో వచ్చిన ఈ మూడు చిత్రాలకు రచనా పరంగా సముద్రాల రాఘవాచార్య నటన పరంగా అక్కినేని నాగేశ్వరరావు కథానాయకులు.
Click Here to go to Anarkali (1954) Movie Page.
1953లో ఫిల్మిస్తాన్ వారు ప్రదీప్ కుమార్, బీనా రాయ్ కాంబినేషన్లో సి. రామచంద్రయ్య సంగీతంతో రూపొంది ఘనవిజయం సాధించిన హిందీ చిత్రం ‘అనార్కలి’. ఒక విధంగా చెప్పాలంటే సంగీత ప్రియుడైన నిర్మాత ఆదినారాయణ రావు తొలి ప్రయత్నంగా ‘పరదేశి’ నిర్మించి, మలిప్రయత్నంగా ‘అనార్కలి’ కథను ఎన్నుకోవడం ఆయన అభిరుచిని సూచిస్తుంది.
మొఘుల్ సామ్రాజ్య అధినేత అక్బరు పాదుషా, అతని భార్య జోధాబాయి. సర్వసేనాని రాజామాన్సింగ్. ఆ మహాసామ్రాజ్యానికి భావినేత, అక్బరు కొడుకు యువరాజు సలీం.పూదోటలో విహరిస్తూ హాయిగా ప్రకృతికి పరవశిస్తూ గానం చేసిన అనార్కలిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు సలీం. అయితే తానూ కేవలం ‘సిపాయి’ అని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరి ప్రేమ చిగురులు వేస్తుంది. తొలి సన్నివేశాల్లోనే అనార్కలి గానాన్ని ప్రశంసిస్తాడు అక్బరుపాదుషా.

యుద్ధంలో దెబ్బతిని అస్వస్థుడైన సలీంకు అనార్కలి గానం కొత్త ఊపిరిపోస్తుంది. ఇది గమనించిన పాదుషా ఆమెను పిలిచి ఆదరిస్తాడు. ఆస్థాన నర్తకిగా నియమిస్తాడు. తన ప్రియుడు సిపాయి కాదని, చక్రవర్తి కుమారుడని తెలుసుకున్న అనార్కలి నివ్వెరపోతుంది. సలీంను దక్కించుకోవాలని ప్రయత్నించినా నర్తకి గుల్నార్ ఎలాగైనా అనార్కలిని భనగాపరచాలని రాజసభలో నృత్యం చేయబోయేముందు మత్తుపానీయాన్ని అందిస్తుంది. ఫలితంగా రాజసభలో అనార్కలి అదుపుతప్పి ప్రవర్తిస్తుంది .
వారి ప్రేమ చక్రవతికి తెలుస్తుంది. అయితే రాజరికపు పెద్దరికం అడ్డు వస్తుంది. సలీంను శిరచ్చేదం చెయ్యమని, అనార్కలిని సజీవంగా సమాధి చెయ్యాలని హుకుం జారీ చేస్తాడు. తలారి బలహీనుడు కాగా ఆ పని నెరవేర్చడానికి పూనుకున్న చరవర్తి కూడా అశక్తుడౌతాడు. సలీం చివరి దశలో తన అనార్కలిని రక్షించుకోవాలని లాహోర్ వెళతాడు. ఈలోగా బాణప్రయోగంతో గుల్నార్ సలీంను గాయపరుస్తుంది. సలీం చేరుకునే సరికి అనార్కలి సమాధి ఎదురౌతుంది. ఆ సమాధికి తలకొట్టుకుని విలపిస్తాడు సలీం.
ఈ కథకు చారిత్రకంగా ఎక్కడ ఆధారాలు లేకపోయినా మంచి నాటకీయత ఉండటం చేత కథ పట్టుగా నడుస్తుంది. అందుకే ఆ తరువాత కె. అసిఫ్ కోట్లు వెచ్చించి దిలీప్ కుమార్, మధుబాల కాంబినేషన్తో ఇదే కథను మొఘుల్-ఎ-ఆజామ్ పేరిట నిర్మించాడు.
అంజలి పిక్చర్స్ నిర్మించిన అనార్కలితో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సంగీతం ‘జీవితమే సఫలమూ’, ‘రావోయి సిపాయి’ పాటలు హిందీ పాటల బాణీలను అనుసరించి చేసిన మిగితా గీతాల్లో ఆదినారాయణరావు ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా ‘కలిసే నెలరాజు కాలువ చెలిని’, ‘సోజా సుకుమారి’, ‘తాగి తూలాలేని తలచెనా లోకము’ చెప్పుకోవచ్చు. మకుటాయమానంగా చెప్పుకోదగ్గ గీతం ‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’. ఈ పాటలోని వాద్యగోష్ఠి రసజ్ఞశ్రోతలెవ్వరు మరచిపోలేరు. పాటల్లోనూ, మాటల్లోనూ సముద్రాల వారి కలం రసవత్తరంగా చిందులు వేసింది.
వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తయారైన ఈ చిత్రంలో ప్రధానపాత్రల్ని అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, పేకేటి శివరాం, నాగయ్య, సురభి బాలసరస్వతి, సి.హేమలత పోషించారు. 28.4.1955న విడుదలైన ఈ చిత్రాన్ని సంగీతపరంగా ఈనాటికీ ఆణిముత్యంగా పేర్కొనవచ్చు.

Source: 101 C, S V Ramarao