ఆంధ్రదేశంలోనే కాదు తెలుగువారింట యే పెళ్ళి పందిరి వెలసినా ఆ సంబరంలో తప్పక వినిపించే పాట “శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి”. సముద్రాల రచనతో, గాలి పెంచల నరసింహారావు స్వర రచనతో, సుశీల సుమధురగాన సాంధర్యంతో, గీతాంజలి లలిత సుకుమార అభినయంతో ప్రాణం పోసుకున్న ఆ కళ్యాణగీతం యన్.టి.రామారావు పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న “సీతారామ కళ్యాణం”లోనిదే!
Click Here to go to Seetharama Kalyanam (1960) Movie Page.
త్రిలోకాధిపత్యం కోరి తపస్సుతో బ్రహ్మను మెప్పించిన దశకంఠుడు తిరుగు ప్రయాణంలో వృత్యకేళి విలాసంలో ఆనందిస్తున్న శివుని దర్శనం కోరి ద్వార పాలకుడు నందీశ్వరుని వల్ల భంగపాటు చెంది, శివుని దర్శనం కోసం జీవనాడులనే వీణా తంత్రులుగా శృతి చేసి శివుని మెప్పించి వరం పొందుతాడు.
జనకమహారాజుకు నాగటిచాలులో ఒక పేటికలో సీత దొరకుతుంది. ఆమెను తనయగా స్వీకరిస్తాడు, శ్రీ మహావిష్ణువు దుస్టశిక్షణ కోసం దశరధుని యింట శ్రీరామునిగా జన్మిస్తాడు. సీతాస్వయంవర సమయంలో శివధనస్సు ఎక్కు పెట్టలేక రావణుడు భంగపడతాడు. ఆ ధనస్సును విరిచి సీతను గెలుచుకుంటాడు శ్రీరాముడు.
ఆగ్రహంతో వచ్చిన పరశురాముని వైష్ణవ ధనస్సును శ్రీరాముడు తాకగా దాని తేజస్సు కళ్యాణరామునికి చేరుతుంది. దేవతలు నవదంపతులైన సీతారాములపై – పుష్పవర్షం కురిపిస్తారు.
ధనేకుల బుచ్చివెంకట కృష్ణ చౌదరి సేకరించిన యీ కథకు సీనియర్ సముద్రాల మాటలు పాటలు వ్రాసారు. రావణబ్రహ్మ కైలాస పరవతాన్ని కదపటం వంటి సన్నివేశాల్ని రసవత్తరంగా చిత్రీకరించారు కెమెరామెన్ రవికాంత్ నగాయిచ్. రావణమందిరం కైలాసగిరి, ఆకాశమార్గాన విమానయానం, జనకుని రాజసభ దర్బారు మొదలైన సెట్స్ను రామాయణకాలం గుర్తుకు వచ్చేలా రూపొందించారు కళాదర్శకులు టి.వి. యస్.శర్మ.
రావగాబ్రహ్మగా ‘యన్.టి.రామారావు ప్రదర్శించిన నటన ఈ చిత్రానికి హైలైట్గా చెప్పుకోవాలి. కళ్యాణరామునిగా హరనాథ్, మండోదరిగా బి. సరోజాదేవి, నారదునిగా కాంతారావు, ఇతర పాత్రలలో గుమ్మడి, నాగయ్య,. మిక్కిలినేని, కె.వి.యస్. శర్మ పాత్రోచితంగా నటించారు.
ఈ చిత్రం ద్వారా సీత పాత్రలో గీతాంజలిని కథానాయికగాను, నలకూబరుని పాత్రలో ప్రముఖ హాస్యనటుడు సారథిని సినీరంగానికి పరిచయం చేశారు యన్.టి.రామారావు.
రావణుడు జీవనాడులను వీణాతంత్రులుగా శృతి చేసిన సన్నివేశంలో ప్రముఖ వీణా విద్వాంసులు ఈమని శంకరశాస్త్రి చూపిన ప్రతిభ అపూర్వం. అలాగే రావణబ్రహ్మ విరచితమైన శివస్తోత్రం ఘంటసాల నోట రావటం, దానికి అభినయపరంగా యన్.టి.ఆర్ ప్రాణం పోయటం చెప్పుకోదగ్గ విశేషం.
రావణుడు మాయారామునిగా రావటం, శ్రీరాముని మోహించిన శూర్పణఖ మాయాసీతగా మారటం, వారిద్దరూ ‘ఓ సుకుమార నినుగని మురిసితిరా’ అంటూ యుగళగీతం పాడటం విచిత్రంగా వుంటుంది.
పండిత పామరులను రంజింపజేసిన ఈ చిత్రానికి కేంద్రప్రభుత్వ యోగ్యతాపత్రం లభించింది.
Source: 101 C, S V Ramarao