ఒక తరహాకు చెందిన ఆదర్శాలకు, సామాజిక స్పృహకు, నవచైతన్యానికి కట్టుబడి చిత్ర నిర్మాణం చేపట్టిన వారిలో ఆద్యులు గూడవల్లి రామబ్రహ్మం కాగా, ఆ కోవలో ఆ తరువాత తరంలో సినిమాలు నిర్మించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి కె.బి,.తిలక్. ఈయన అనుపమ పతాకంపై నిర్మించిన మొదటి చిత్రం ముద్దుబిడ్డ కాగా రెండవ చిత్రం ఎమ్.ఎల్.ఏ.
Click Here to go to M.L.A (1955) Movie Page.
కె.బి.తిలక్ స్వతహగా ఎడిటర్ అంతేకాదు విశిష్ట దర్శకుడు ఎల్.వి.ప్రసాద్‌కు స్వయానా మేనల్లుడు. ఈనాడు జరుగుతున్న ‘రిమోటు కంట్రోల్’ రాజకీయాలను ఆనాడే తెరపై ఆవిష్కరించిన చిత్రం ఎమ్.ఎల్.ఏ.
దామోదరం లౌక్యం తెలిసిన రాజకీయవేత్త. ఎన్నికల్లో తను గెలవటం కష్టం అని తెలుసుకొని, మరొకడు గెలవకుండా వుండాలంటే తన చెప్పుచేతల్లో వున్నవాణ్ణి గెలిపించాలనుకొంటాడు. అందుకు దాసు అనే వ్యక్తిని ఎంచుకుంటాడు. దాసు పట్ల అతని నిజాయతీపట్ల ప్రజలకు విశ్వాసం వుంది. దానికితోడు దామోదరం వత్తాసు ఫలితంగా ప్రజలు దాసును ఎమ్.ఎల్.ఏ.గా గెలిపిస్తారు. దాసుకు మనసిచ్చిన మగువ నిర్మల. ఆమె దాసు ఉన్నత విద్య పూర్తిచేయటానికి సహకరిస్తుంది.
దాసు ప్రజల క్షేమం కోరి భూసంస్కరణలకు వత్తాసు పలికి, గరిష్ట పరిమితిగూర్చి ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తాడు. (ఇది 1957 లో విడుదలయిన చిత్రం. అప్పుడు రాజకీయాలలో వేడివేడి చర్చలకు కీలకమైన అంశం ఈ భూసంస్కరణలు). దాసును తన గుప్పిట్లో పెట్టుకొని చక్రం తిప్పాలనుకున్న దామోదరానికి ఇది గిట్టదు. దాంతో దాసు గత చరిత్రకు చెందిన కొన్ని కాగితాలతో దాసును బ్లాక్ మెయిల్ చెయ్యాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆ కాగితాలు రెండో హీరోకు చిక్కుతాయి. అతను వాటిని నాశనం చేస్తాడు. ఫలితంగా దామోదరం ఎత్తుగడ ఫలించదు. ప్రజలంతా దామోదరాన్ని ఛీకొట్టి దాసును ప్రశంసిస్తారు.
దర్శకనిర్మాత తిలక్ ఈ కథను నవరసభరితంగా తెరకెక్కించటానికి ప్రయత్నించి కృతకృత్యులయ్యారు. ప్రధాన పాత్రల్లో హీరో దాసుగా జగ్గయ్య, అతడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకునే యువతి నిర్మలగా సావిత్రి, విలన్ దామోదరంగా గుమ్మడి తమ నటన ద్వారా చిత్రానికి ప్రాణం పోశారు. సహాయపాత్రల్లో సూర్యకళ, రమణారెడ్డి, పెరుమాళ్ళు దర్శక నిర్మాత కె.బి. తిలక్ కనిపిస్తారు. రమణమూర్తి ఈ చిత్రం ద్వారా సినీపరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయనకు జోడీగా గిరిజ హుషారుగా నటించింది. కుర్షీద్ కూడా ఈ చిత్రంలో నర్తకిగా పరిచయమైంది.
ఎమ్.ఎల్.ఏ చిత్రం పేరు వినగానే గుర్తుకు వచ్చేవి ఆరుద్ర, పెండ్యాల కాంబినేషన్లో జీవం పోసుకున్న అద్భుతమైన గీతాలు, ప్రముఖ గాయని ఎస్.జానకి ఈ చిత్రంలోని ‘నీ ఆశ అడియాస లంబాడోళ్ల రాందాసా…’ అన్న గీతాన్ని తొలిసారిగా ఘంటసాలతో కలిసి ఆలపించి, గాయనిగా చిత్రసీమకు పరిచయమయ్యారు. రమణమూర్తి, గిరిజలపై చిత్రీకరించిన యుగళగీతం ‘జామిచెట్టు మీద నున్న జాతీ రామచిలుక’, హైదరాబాద్ నగర వైభవాన్ని వివరించే ‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం’ నృత్యగీతం, ‘ఒకసారి కన్నెత్తి చూడు’ చెప్పుకోదగ్గవి. అయితే కథాపరంగా ఉత్తేజపరిచే గీతం ‘నమో నమో బాపు మాకు న్యాయమార్గమే చూపు’.
సంగీత సాహిత్యపు విలువల్ని సామాజిక ప్రగతికి ఉపయోగపడే కథతో జోడించి, ప్రయోజనాత్మకమైన చిత్రాన్ని అందించిన తిలక్ ప్రశంసనీయుడు.

Source: 101 C, S V Ramarao