కన్నడ చిత్ర రంగంలో నటుడు, దర్శకుడుగా వినుతికెక్కిన ఆర్.నాగేంద్రరావు ఆ రోజుల్లో విజయవంతంగా ప్రదర్శించిన నాటకం ‘భూకైలాస్’, దాని ఆధారంగా ఏ.విమెయ్యప్పన్ 1940లో తెలుగులో ‘భూకైలాస్’ చిత్రాన్ని నిర్మించారు. దానికి మరాఠీకి చెందిన సుందరరావు నడకర్ణి దర్శకుడు (అంతకుముందు ఆయనే దర్శకుడు), నిర్మాత తమిళుడు, నటీనటులు కన్నడగు చెందిన ఆర్.నాగేంద్రరావు, యం.వి.సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి ప్రధాన పాత్రధారులు.
Click Here to go to Bhookailas (1958) Movie Page.
భూకైలాస్’ కథను 1958లో అదే ఏ.వి.యం. సంస్థ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించింది. తెలుగుచిత్రంలో యన్.టి.రామారావు (రావణాసురుడు), అక్కినేని నాగేశ్వరరావు (నారదుడు), జమున (మండోదరి), ఎస్.వి.రంగారావు (మండోదరి తండ్రి), హేమలత (కైకేయి) ప్రధాన పాత్రలు పోషించగా కన్నడ చిత్రంలో రాజ్ కుమార్, కల్యాణ్ కుమార్, బి.సరోజాదేవి నటించారు.
పరమశివుని భక్తుడైన రావణబ్రహ్మ తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం కాగా మహామాయ ఫలితంగా పార్వతీదేవినే తన సతిగా కావలెనని వరం కోరతాడు. తప్పనిసరై పార్వతి రావణుని అనుసరిస్తుంది. మార్గమధ్యంలో నారదుడు ఎదురుపడి పార్వతికి తరుణోపాయం చూపించి, ఆ వనంలో విహారానికి వచ్చిన మండోదరిని చూసి ఆమె పార్వతి అని రావణునికి భ్రమ కల్పిస్తాడు. ఫలితంగా రావణుడు మండోదరిని అర్థాంగిగా స్వీకరిస్తాడు. ఆ తరువాత మహాశివుని ఆత్మలింగాన్ని పొందాలని ప్రయత్నిస్తాడు. అయితే పరమశివుడు దానిని నేల మీద వుంచరాదని సూచిస్తాడు. నారదుని కుటిలతంత్రంవల్ల ఓ బాబుని చేతిలో ఆత్మలింగాన్ని వుంచి శివార్చనకు రావణుడు వెళతాడు తిరిగి వచ్చేలోగా ఆ బాలుడు ఆత్మలింగాన్ని భూమిమీద ఉంచుతాడు. రావణుని ప్రయత్నం వృధా అవుతుంది. దాంతో రావణుడు ఆత్మార్పణకు సిద్దమౌతాడు.

అతని భక్తికి పరవశుడైన శివుడు ఆ లింగం నేలపై వున్న స్థలమే భూకైలాస్ అని చెప్పగా రావణుడు సంతృప్తి చెందుతాడు.
ఈ కథను అత్యంత రసవత్తరంగా తెరకు అనువదించారు దర్శకుడు కె.శంకర్ 1940 నాటి చిత్రానికి ఆర్.సుదర్శనం సంగీతం అందించగా ఈ చిత్రానికి ఆయనతోబాటు ఆర్.గోవర్ధనం కూడా కలిసి సంగీతాన్ని అందించారు. రావణుని కాలంనాటి సెట్స్ ని అందంగా తెరపై ఆవిష్కరించిన ఘనత కెమెరామన్ మాధవ్ బుల్ బుల్ కే దక్కుతుంది.
ఈ చిత్రంలో ప్రత్యేకించి చెప్పుకోవలసిన అంశం సముద్రాల రాఘవాచార్య రచన, రామావతార విశేషాన్ని ‘రాముని అవతారం, రఘుకుల సోముని అవతారం’ అన్న గీతంలో వివరించారు. ‘దేవదేవ ధవళాచల మందిరా గంగాధర హర నమోనమో’ అని రావణుడు గానంచేయగా, ‘నారాయణ హర నమో నమో’ అని నారదుడు గానం చేస్తాడు. ఇద్దరు కథానాయకుల స్వరాలకు తగ్గట్టు ఆ పాటల్ని ఘంటసాల సుమధురంగా ఆలపించారు. జమునపై చిత్రీకరించిన ‘అందములు చిందులిడే అవని ఇదేనా, హెలెన్ నృత్యగీతం సుందరాంగా ఆందుకోరా’, కమలా లక్ష్మణ్ నృత్యగీతం ‘మున్నీట పయనించు నాగశయనా’ చెప్పుకోదగినవి.
నెగెటివ్ రోల్స్ పట్ల యన్.టి.రామారావుకు అభిమానం పెంచిన మొదటి చిత్రంగా ‘భూకైలాస్’ను పేర్కొనాలి. 20.3.1958న విడుదలైన ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలత కూడిన పౌరాణిక చిత్రంగా ప్రశంసలందుకుంది.
Source: 101 C, S V Ramarao