సినిమా కథకు, అందునా జానపద కథకు కాళ్లు ఉండక్కర్లేదు. రీజన్, లాజిక్ అంతకన్నా అవసరం లేదు. కథా సంవిధానం తో ప్రేక్షకుల్ని కాసేపు ఊహా లోకంలో విహరింపజేసి కొన్ని మధురానుభూతుల్ని, మరికొన్ని థ్రిల్స్ని జత కలిపి అందజేస్తే ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరథం పడతారు అని నమ్మిన వ్యక్తి ప్రతిభ అధినేత ఘంటసాల బలరామయ్య. ఆయన నమ్మిన పద్ధతిలో సముద్రాల రాఘవాచార్య ఒక అద్భుత సంగీత భరిత దృశ్య కావ్యాన్ని రూపకల్పన చేశారు. దానికి ప్రాణం పోశారు సంగీత దర్శకుడు సుబ్బరామన్. వేదాంతం రాఘవయ్య నేతృత్వంలో నేత్రపర్వంగా నృత్యాలు రూపొందించబడ్డాయి.
Click Here to go to Samsaram (1950) Movie Page.
తేనెలు జాలువారే విధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆర్. బాల సరస్వతి దేవి, పి. లీల, జి.వరలక్ష్మి, కస్తూరి శివరావు పాటలు ఆలపించారు. తెరపై ఆ పాటలకు, సముద్రాల సృష్టించిన పాత్రలకు ప్రాణం పోశారు అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, జి.వరలక్ష్మి, ముక్కామల, శివ రావు, సురభి బాలసరస్వతి. ఆ సన్నివేశాల్ని అద్భుతమైన ఎఫెక్టుతో చిత్రీకరించారు కెమెరామెన్ పి. శ్రీధర్. వీటన్నిటినీ సమస్వయ పరచుకుని తన ప్రతిభను జోడించి బలరామయ్య సృష్టించిన సౌందర్య లహరి ‘ స్వప్నసుందరి’ చిత్రం.

అనగనగా ప్రభు అనే ఓ రాజకుమారుడు అబ్బి అనే జతగాన్ని తీసుకొని దేశాటనకు బయలుదేరుతాడు. ‘సాగుమా సాహిణి, ఆగని వేగమే జీవితము, కనబడువరకు కాదీలోకము- కలదింకెంతో సౌందర్యం’ వచ్చి ‘ ఓ పరదేశీ మరేజడలా చూడవురా ఈ హాయినీ’ అని మరులు గొలిపి మాయమవుతుంది. ఆమెను చూడాలని ప్రయత్నించిన ప్రభు కోయ రాణి వలలో చిక్కుకుంటాడు. ఆమె ప్రేమను కాదని తప్పించుకొని బయటపడ్డ ప్రభుకు నిజంగానే స్వప్నసుందరి కనిపించి తన లోకానికి తీసుకెళ్లి ‘ ఓ సొగసరి గడసరి వాడా’ అంటూ మురిపిస్తుంది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న ఆ లోకపాలకుడు భూలోకానికి పొమ్మని ఇద్దరిని పంపించి వేస్తాడు. అప్పుడు హాయిగా ఇద్దరు భూలోకంలో ‘ ఈ సీమ వెలసిన హాయీ మన ప్రేమ ఫలమోయీ’ అని యుగళగీతం పాడుకుంటారు. ఇంతలో ఓ మాయల మరాఠీ తరహా మాంత్రికుడు పున్నమి విందు కోసం సుందరిని అపహరించి తన మందిరానికి చేరుస్తాడు. ‘కానగనైతినిగా నిన్నూ’ అంటూ విరహ బాధతో ప్రభు ఓ పూట కూళ్ళమ్మ సహాయంతో మాంత్రికుని జాడ తెలుసుకొని అక్కడకు ప్రవేశించగా మాంత్రికుడు బంధిస్తాడు. ఇంతలో ప్రభు జాడ తెలుసుకున్న కోయరాణి తన పరివారంతో మాంత్రికుని గుహకు చేరుకొని ప్రభుకు విముక్తి కలిగిస్తుంది. ప్రభు మాంత్రికుడిని సంహరిస్తాడు. ఆ పోరాటంలో కోయ రాణి ప్రాణాలు కోల్పోతుంది. క్లుప్తంగా ఇదీ కథ.
ఆ తరువాత అంజలీ పిక్చర్స్ నిర్మించిన ‘ సువర్ణ సుందరి’ ఈ చిత్రానికి దీనికి దగ్గర పోలికలున్నాయనిపిస్తుంది. 10.11.1950న దీపావళికి విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించలేక పోయినా సంగీతపరంగా ఇందులోని ఆణిముత్యాలవంటి పాటలు సంగీత ప్రియుల్ని ఆకర్షించాయి.
అసలు చెప్పే మంచం కోళ్ళు, థ్రిల్ కల్గించే శవం చెప్పే మాటలు, నిముషానికోసారి కొడుకుని చంపి, తిరిగి బ్రతికించే పేదరాశి పెద్దమ్మ చిత్రాలు, ‘ ప్రియురాలి కౌగిలి కంటే కమ్మగా ఉందా కత్తుల బోను’ అంటూ హుంకరించిన ముక్కామల విలనీ, ఒకింత అశ్లీలాన్ని అర్ధోక్తితో అందించే శివ రావు హాస్యం, సెక్సీగా అనిపించే జి.వరలక్ష్మి నట విన్యాసం, అక్కినేని హీరోయిజం, అంజలీదేవి హొయలు ఇవన్నీ ఆనాటి రసజ్ఞ ప్రేక్షక లోకాన్ని మురిపించిన ‘ స్వప్నసుందరి’ చిత్రంలోని విశేషాలలో కొన్ని. ఇందులోని ఎన్నో చాలు ఆ తరువాత వచ్చిన విఠలాచార్య మార్కు జానపద చిత్రాల్లో మనకు దర్శనమిస్తాయి. ఆ విధంగా స్మరణీయమైన రమణీయ చిత్రం ‘ స్వప్నసుందరి’.

Source: 101 C, S V Ramarao