తెలుగు చలనచిత్ర చరిత్ర పరిశోధనల ఫలితంగా వెల్లడైన అంశం ఏమిటంటే తొలిసారిగా తెలుగులో ప్లేబాక్ ప్రవేశపెట్టిన చిత్రం ‘మళ్ళీపెళ్ళి’. కథానాయిక కాంచనామాలతోబాటు “సురుచిర సుందరరూప” అనే యుగళగీతాన్ని కథానాయిక పాత్రధారి Y.V. రావు పాడినట్లు రికార్డులమీద వున్నా నిజానికి ఆ వాయిస్ ఆ చిత్రదర్శకుడు ఓగిరాల రామచంద్రరావుది.
ఇక అసలు విషయానికి వస్తే అంతకుముందు కన్నడ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించిన వై.వి.రావు, జగదీష్ ఫిలిమ్స్ స్థాపించి మంచి బలమైన కథను ఎన్నుకొని గుండె ధైర్యంతో తానే కథానాయకుడిగా నటించి స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం “మళ్లీ పెళ్లి”.
Click Here to go to Malli Pelli (1939) Movie Page.
జనార్ధన రావు పంతులు సనాతన ఆచార వ్యవహారాలకు, కట్టుబాట్లకు విలువ నిచ్చే చాందసుడు. తన ఆరేళ్ల కూతురు లలితను ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయగా అతను చనిపోతాడు. ఫలితంగా లలిత చిన్నతనంలోనే విధవరాలు అవుతుంది. తీవ్రమైన కట్టుబాట్లు మధ్య పెరిగి పెద్దదవుతుంది లలిత. ఆమెకు సుందర రావు అనే సంఘసంస్కర్త పరిచయమవుతాడు. అతడు ఆమెకు నచ్చజెప్పి ఒప్పించి ప్రాచీన కట్టుబాట్లు, శృంఖలాలనుంచి విముక్తిరాలిని చేసి పెళ్లి చేసుకుంటాడు. నాటి సంఘసంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం గార్ల ఊహలకు ఊపిరి పోసింది ఈ చిత్రం.

ఇందులో ప్రధాన పాత్రలు పాత్రల్ని బలిజేపల్లి లక్ష్మి కాంతకవి వై. వి. రావు, కాంచనమాల, బెజవాడ రాజారత్నం, ప్రముఖ రంగస్థల నటుడు కొచ్చర్లకోట సత్యనారాయణ పోషించారు. బలిజేపల్లి మాటలు, పాటలు రాయగా ఓగిరాల రామచంద్రరావు సంగీతాన్ని సమకూర్చారు.
అటు కట్టుబాట్లకు, విధించిన ఆంక్షలకు, ఇటు వయస్సు రీత్యా చెలరేగే కోర్కెలకు మధ్య నలిగిపోయిన కథానాయికగా కాంచనమాల చూపిన నటన అపూర్వం.

1938లో కుల వ్యవస్థను వెక్కిరిస్తూ గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’ నిర్మిస్తే, 1939లో సాంఘిక దురాచారాల్ని సవాలు చేస్తూ వై. వి. రావు ‘మళ్లీ పెళ్లి’ అందించారు. అందుకే ఆ చిత్రాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాళ్లుగా మిగిలిపోయాయి.
Source: 101 C, S V Ramarao