Site icon Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema

Santhanam (1955): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

చిత్రవిచిత్రమైన సినీసీమలో సెంటిమెంట్లు చాలా తమాషాగా వుంటాయి కొంతకాలం జగపతివారి చిత్రాలు ‘ఆ… అ’లతో మొదలయ్యేవి. బాబూ మూవీస్ వారు ‘మనసులు’కు ముందు ఓ విశేషణాన్ని జతచేసి చిత్రాలు తీశారు. (మంచి, మూగ”తేనె, కన్నె), తమిళంలో దర్శకులు భీమ్సింగ్ తీసిన చిత్రాలు ఎక్కువగా ఇంగ్లీషులోని ‘పి’ లెటర్ తో ప్రారంభమయ్యేవి. ఆ దిశగా ఆలోచిస్తే సాధనా పతాకంపై నిర్మాత రంగనాధదాస్ నిర్మించిన మొదటి చిత్రం సంసారం, రెండోది సంతానం, మూడోది సంకల్పం. ఆ తరువాత ఆయన ఆ సెంటిమెంట్కు శుభం చెప్పి ‘తోబుట్టువులు’ సినిమా తీశారు.

Click Here to go to Santhanam (1955) Movie Page.

ఇక అసలుకథకు వస్తే రంగయ్యఅనే మిల్లు కార్మికుడికి లక్ష్మి రాము, బాబు అనే ముగ్గురు సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు కోల్పోతాడు రంగయ్య (ఎస్.వి. రంగరావు), సంతానం ముగ్గురూ లక్ష్మి (బేబీ విజయలక్ష్మీ, శ్రీరంజని), రాము (జూ. నాగేశ్వరరావు, ఆక్కినేని నాగేశ్వరరావు), బాబు (చలం) కలిసి జీవినయానం సాగించి విధివశాత్తు బాల్యదశలోనే విడిపోతారు. ఈ విడిపోకముందు అక్క లక్ష్మీ చిన్నతమ్ముణ్ణి నిద్రపుచ్చుతూ ‘నిదురపోరా తమ్ముడా’ అని జోల పాడుతుంది. ఈ పాటే కథకు కీలకం, ఓ ఇరవైయేళ్ళు గడిచాక ఇదే పాట వారిని ఏకం చేస్తుంది. (ఇదే ఫార్ములాతో హిందీలో యాదోంకీ బారాత్ వంటి ఎన్నో హిట్ చిత్రాలు రూపొందాయి).

పరిస్థితులు రీత్యా విడిపోయిన లక్ష్మి ఓ జమిందారు (మిక్కిలినేని) ఇంట వంటమనిషిగా చేరుతుంది. రాము నాటకాల కంపెనీలో చేరి వేషాలేస్తూ పెరిగి పెద్దవాడై కృష్ణ వేషంలో ఓ జమిందారు (రేలంగి) ఇంట్లో ప్రవేశించి అతని కూతురు (సావిత్రి) అభిమానాన్ని, ప్రేమను పొందుతాడు. మూడోవాడైన బాబు ఓ వస్తాదు వద్ద పెరిగి మిక్కిలినేని కూతురు (కుసుమకుమారి)ను ప్రీమిస్తాడు. మిక్కిలినేనికి ఓ కొడుకు (అమరనాధ్), అతను లక్ష్మిని ప్రేమిస్తాడు. ఇది నచ్చని పెద్దాయన కొడుకు విదేశాలకు వెళ్ళగానే లక్ష్మిని ఇంటినుంచి గెంటివేస్తాడు. ఆ బాధతో లక్ష్మి పాడిన గీతం (చిన్నప్పటి గీతం)తో రాము అక్కను గుర్తిస్తాడు. వారిద్దరూ పతాక సన్నివేశంలో తమ్ముడు బాబును, తండ్రి రంగయ్యను కలుసుకుంటారు. ఆ విధంగా అంధుడైన తండ్రి రంగయ్య తన సంతానం ముగ్గుర్నీ కలుసుకోవడం, అపార్థాలు తొలగి ఆ ముగ్గురికి కోరుకున్నవారితో వివాహం జరగడంతో కథ సుఖాంతమౌతుంది.

సుప్రసిద్ధ దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షకులు. కనుక సెంటిమెంట్కు, హాస్యానికి, ప్రేమకు తగినంత ప్రాధాన్యతతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దర్శక, నిర్మాత రంగనాథదాసు. ఆనిసెట్టి-పినిసెట్టి రచన చేసిన ఈ చిత్రంలో సుసర్ణ దక్షిణామూర్తి స్వరరచనతో ఘాంటసాల గానంతో పరవశింపచేసే రెండుపాటలున్నాయి. అవి ‘దేవి శ్రీదేవి’ ఒకటి కాగా, రెండోది ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో, హిందీ బాణిని అనుసరించి స్వరపరచిన మరో రెండుగీతాలు సంతోష మేలా సంగీతమేలా, మురళీగానమిదేనా, కాగా సంతానం చిత్రాన్ని ప్రేక్షకులు మరిచిపోలేకుండా చేసిన ఒకే ఒక అంశం ఈ చిత్రానికి లతామంగేష్కర్ గానం చేసిన ‘నిదురపోరా తమ్ముడా’ అనే గీతం. చిత్రంలోని ద్వితీయార్థం లో ఘంటసాల కూడా ఆమెతో గళం కలిపారు. ‘ఏరువాకా’ పాట రోజులు మారాయి’ని హిట్ చేసి, ‘నిదురపోరా తమ్ముడా’ అనే గీతం అదే సంవత్సరం 5.8.1958న విడుదలైన ‘సంతానం’ చిత్రాన్నికలకాలం గుర్తుండిపోయేలా చేసింది.

Source: 101 C, S V Ramarao

Spread the love: