Site icon Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema

Pooja Phalam (1964): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

ఆ ఇద్దరూ దాదాపాల్కే ఎనార్డు గ్రహీతలే! ఒకరు వాహినీ పతాకంపై విశిష్ట చిత్రాలనందించిన బి.యన్.రెడ్డి మరొకరు ఆంధ్రుల అభిమాన కధానాయకుడు అక్కినేని; వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన అపురూప చిత్రం శంభూ ఫిలింస్ వారి “పూజాఫలం”.

Click Here to go to Pooja Phalam (1964) Movie Page.

మొదటి నుంచీ కథ, కథనం, క్వారక్టరైజేషన్ అనే విషయాలకు ప్రాధాన్యత నిచ్చిన దర్శకులు బి.యన్.రెడ్డి, మునిపల్లెరాజు వ్రాసిన నవల “పూజారి”. ఆయన దృష్టినాకర్షించింది. దానిని సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేసి సంభాషణలు వ్రాసారు డి.వి.నరసరాజు.

చిత్ర కధానాయకుడు మధు సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతనికి బిడియం హెచ్చు, అతని జీవితంలోకి ముగ్గురు యువతులు ప్రవేశిస్తారు. ఆడవాళ్ళకు దూరంగా వుండే మధు భవంతిలోకి అద్దెకు వచ్చిన వాసంతి అతనితో చనువుగా ప్రవర్తించటంతో అతనితో ప్రణయ భావావేశం మొగ్గలు తొడుగుతుంది. ఆమె తండ్రికి బదిలీ అవటంతో దూరమౌతుంది. తరువాత అతని జీవితంలోకి సీత ప్రవేశిస్తుంది. ఆమె యెవరోకాదు అతని ఎస్టేటు వ్యవహారాలు చూసే గుమాస్తా కుమార్తె, ఆమె మధుకి యెంతో సన్నిహితమౌతుంది. వారిద్దరి మధ్య అనురాగం చిగురించి పరస్పర ఆరాధనా భావంగా మారుతుంది.

ఇంతలో మధు జీవితంలో చెలరేగిన తుఫాను ఫలితంగా నీలనాగిని అనే వేశ్య, ఆమె బంధుగణం ప్రవేశిస్తారు. ఒకవిధంగా నీలనాగిని నుంచి మధుకు స్వాంతన లభించినా, వారి నిజరూపాన్ని గ్రహించిన మధు వారిని తన్నితగిలేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆస్థికి వారసత్వ పరమైన చిక్కులో యిరుక్కొంటాడు మధు. దాని నుంచి సీత, ఆమె తండ్రి సహాయంతో బైట పడిన మధు, సీతను భార్యగా స్వీకరిస్తాడు. సీత చేసిన పూజలకు ఫలప్రాప్తి దక్కటంతో కథ సుఖాంతమౌతుంది.

1964వ సంవత్సరం తొలి దినాన (1.1.1964) విడుదలైన యీ చిత్రంలో మానసిక విశ్లేషనకు ప్రాధాన్యతనిచ్చి పాత్రల్ని, సన్నివేశాలను డి.వి.నరసరాజు తీర్చిదిద్దిన పద్ధతి ప్రశంసనీయం. కధానాయకుడు మధుగా అక్కినేని, ఆ పాత్రతో సంబంధమున్న మూడు మహిళా పాత్రల్ని జమున, సావిత్రి, ఎల్.విజయలక్ష్మి సమర్ధవంతంగా పోషించారు.

సహాయ పాత్రల్లో గుమ్మడి, మిక్కిలినేని, గెస్టుగా జగ్గయ్య నటించగా, రేలంగి,రాజశ్రీ, పొట్టిప్రసాద్, రమణారెడ్డి హాస్యాన్ని అందించారు.

ఎల్.విజయలక్ష్మి నృత్యాలకు ముఖ్యంగా “శివదీక్షాపరురాలనురా” అన్న గీతానికి పసుమర్తి కృష్ణమూర్తి సమకూర్చిన నృత్య భంగిమలు సముదాత్తంగా వున్నాయి.

ఈ చిత్రం పేరు వినగానే గుర్తుకు వచ్చేది సాలూరు రాజేశ్వరరావు అందించిన సుమధుర సంగీతం. అంతవరకూ బి.యన్.కు అధికసంఖ్యలో గీతాలు వ్రాసిన దేవులపల్లి యిందులో రెండు గీతాలు వ్రాయగా సి.నారాయణరెడ్డి వ్రాసిన ‘పగలే వెన్నెల, నిన్నలేని అందమేదో” గీతాలు ప్రాచుర్యం పొందటం చెప్పుకోదగ్గ విశేషం. అయితే దేవులపల్లి వ్రాసిన “ఇది వెన్నెల వేళయనా” గీతం – దానికి పోరూర్ గోపాల్కృష్ణన్ ఫిడేలుపై పలికించిన విచిత్రగమకాలు రసజ్ఞహ్పదయాల్ని పులకింప జేసాయి.

Source: 101 C, S V Ramarao

Spread the love: