Site icon Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema

Draupadi Vastrapaharanam (1936): In To The History #TeluguCinemaHistory

ద్రౌపది వస్త్రాపహరణమా? మానసంరక్షణమా?

భారతకథలో ముఖ్యమైన ఘట్టం నిండుసభలో ద్రౌపదికి దుర్యోధనాదుల వల్ల జరిగిన అవమానం. ఈ కథలో దుర్యోధనాదులు ‘ద్రౌపదికి’ ‘వస్త్రాపహరణం’ చేయబోతే శ్రీకృష్ణుడు ఆమెకు చీరలు అదృశ్యంగా ప్రసాదించి ఆమె మానాన్ని సంరక్షిస్తాడు. ఈ ఇతి వృత్తాన్ని 1936లో పోటీపడి ఇద్దరు సినిమాగా తీశారు.

లక్ష్మి ఫిలిమ్స్ పతాకంపై S.జగన్నాధ్ దర్శకత్వంలో ‘ద్రౌపది మానసంరక్షణ’ నిర్మించారు. దీనికి పాపట్ల కాంతయ్య సంగీతాన్ని అందించారు. అప్పటికే రంగస్థలంపై దుర్యోధనుడి పాత్రలో పేరొందిన బళ్ళారి రాఘవ ఈ చిత్రంలో దుర్యోధనుని పాత్ర పోషించగా సురభి కమలాబాయి, బందా కనకలింగేశ్వరరావు ఇతర ముఖ్య పాత్రల్నిపోషించారు.

H.M. రెడ్డికి బావ అయినా H.V. బాబు దర్శకత్వంలో అదే కథను ‘ద్రౌపది వస్త్రాపహరణం’ పేరుతో సరస్వతి టాకీస్ వారు నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణంలో పారుపల్లి శేషయ్య, K. సుబ్బారావు, గూడవల్లి రామబ్రహ్మం పాల్గొన్నారు. ఈ చిత్రానికి మల్లాది అచ్యుత రామశాస్త్రి రచన చేయగా, భీమవరపు నరసింహారావు (B.N.R) సంగీతాన్ని అందించారు. అంతకుముందే రంగస్థలంపై కృష్ణ పాత్రా పోషణలో పేరొందిన C.S.R. ఆంజనేయులు శ్రీ కృష్ణునిగా, యడవల్లి సూర్యనారాయణ దుర్యోధనునిగా, 1935లో హరిశ్చంద్ర ద్వారా పరిచయమైన నటి కన్నాంబ ద్రౌపదిగా నటించారు.

Click here to go to Draupadi Vastrapaharanam (1936) movie page.

CSR as Sri Krishna

బళ్ళారి రాఘవ నటించిన ‘మానసంరక్షణ’ పరాజయం పొందగా H.V. బాబు తీసిన ‘వస్త్రాపహరణం’ విజయవిహారం చేసింది.

ఈ రెండు చిత్రాల్ని బందరు నుంచి వెలువడ్డ ‘కృష్ణా పత్రిక’ లో సమీక్షిస్తూ కమలాకర కామేశ్వరరావు విజయవంతమైన ‘వస్త్రాపహరణం’ కంటే పరాజయం పొందిన ‘మానసంరక్షణ’ చిత్రంలో సాంకేతిక విలువలు, నటీనటుల ప్రదర్శన బాగున్నాయని సోదాహరణంగా వివరించారు. ‘మానసంరక్షణ’ అనే టైటిల్లో పాజిటివ్ అప్రోచ్ ఉందని ప్రశంసించారు.

తన ప్రమేయం ఉన్న చిత్రం ఆర్థికంగా విజయవంతమయినా అందులోని లోపాల్ని సూచించిన సమీక్షను స్పోర్టివ్గా తీసుకొని కామేశ్వరరావుని మద్రాసు పిలిపించి ఆయన సినీరంగప్రవేశానికి కారకులయ్యారు దర్శకులు H.M. రెడ్డి.

‘ద్రౌపది’ కథపై నిర్మించబడ్డ రెండు చిత్రాలను సమీక్షించి తద్వారా సినీరంగంలో ప్రవేశించిన కమలాకర కామేశ్వరరావు అదె కథ ప్రధానాంశంగా నిర్మితమై 1965 సంక్రాంతి కానుకగా విడుదలైన “పాండవ వనవాసం” చిత్రానికి దర్శకత్వం వహించటం అది పౌరాణిక చిత్రాల్లో ప్రామాణికంగా చెప్పుకోదగ్గ రీతిలో రూపొందటం విశేషం.

Source: 101 C, S V Ramarao

Spread the love: